మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తండ్రీ తనయుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు.
కాగా, ఈ సినిమాలో చిరు, చరణ్ మద్య వచ్చే సన్నివేశాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయని అంటున్నారు. ఇద్దరు కూడా నక్సలైట్లుగా కనిపిస్తారని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. కాని తాజాగా ఒక కొత్త పుకారు షికారు చేస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో చిరంజీవి పై అటాక్ జరుగుతుందని.. పోలీసులు చేసే ఆ అటాక్ లో చిరు ప్రాణాలను ఆ పోలీసుల్లో ఒక్కడైన చరణ్ కాపాడుతాడని.. చిరంజీవి వల్లే చదువుకున్న సిద్ద ఆయన్ను కాపాడటంతో పాటు ఆయన దారిలో నడిచేందుకు సిద్దం అవుతాడట. అలా సిద్ద, ఆచార్యలు కలిసి ఉద్యమంలో ముందుకు సాగుతారని అంటున్నారు. ఈ సీన్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. మే 13న ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.