యువ కథానాయకుడు నితిన్ హీరోగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ ఫిల్మ్ ‘అంధాధూన్’ చిత్రం రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్రలో అలరించనుంది. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది.
ఇదిలాఉంటే.. నితిన్ పుట్టినరోజు కానుకగా ఓ గ్లిమ్స్ ని కూడా ‘మాస్ట్రో’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో నితిన్ అంధుడైన ఓ వాద్య కళాకారుడిగా పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఓ పిల్లి పియానో పై కాలు పెట్టగా.. నితిన్ ఓ వాటర్ టబ్ లో తల పెట్టి భయభయంగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అతని రెండు కళ్ళు తెల్లగా మారిపోవడం చూస్తుంటే ఎవరో కావాలనే తన చూపుని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. దీనికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం.. జె.యువరాజ్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.