చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవికి ఖైదీ చిత్రం విజయాన్ని అందించి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఖైదీ అనంతరం 151 చిత్రంగా వచ్చిన సైరా నర్సింహరెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టగా ప్రస్తుతం ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తరువాత మలయాళ చిత్రం లూసిఫర్ రీమెక్‌లో నటించనున్నాడు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా, రెండు సినిమాలు చేతిలో ఉండగానే చిరంజీవి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.. దర్శకుడు కేఎస్ రవీంద్రతతో(బాబీ) తన 154వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు ఇటీవల చిరంజీవి స్వయంగా పేర్కొన్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనే చిరంజీవి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. బాబీ చెప్పిన కథ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘వీరయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లోనే మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.