ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 2020లోనే ఈ సినిమా గురించి ప్రకటన వెలువడింది. కళ్యాణ్ రామ్, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ తో పాటు చౌడప్ప నాయుడు అనే మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీలలో ఒకరిని ఎంపిక చేయనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మంథానను కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజులుగా హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ తో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ నిమిత్తం లక్నోలో ఉంది. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్ చేరుకుంది. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన కథ కథ కూడా నచ్చడంతో రష్మిక ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం.