విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు. అఖిలపక్షంతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం పై ప్రధానిని కలిసి మాట్లాడేందుకు అనుమతి కోరారు. 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గతంలో రాసిన లేఖలోని అంశాలను మరోసారి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) సంస్థ వద్ద 7వేల ఎకరాలు ఉపయోగించని భూమి ఉంది. ప్లాట్ల కింద మార్చి ఆర్ఐఎన్ఎల్ను ఆర్థికంగా బలపరచవచ్చు’ అని జగన్ సూచించారు.
మరోవైపు విశాఖ ఉక్కుపై కేంద్రం తాజా ప్రకటనతో కార్మికులు, నిర్వాసితులు భగ్గుమన్నారు. సోమవారం రాత్రి నుంచి ఆందోళనలు తీవ్రతరం చేశారు.. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను ఉద్యమకారులు దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనలకు పార్టీలు, మిగిలిన కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేది లేదని ఉద్యమకారులు స్పష్టం చేశారు.