మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైన సంగతి తెలిసిందే. తాజాగా సెట్స్ లో రామ్‌చరణ్ ఫొటోను షేర్ చేసిన కొరటాల శివ..’ఆచార్య సిద్ధమవుతున్నాడు’ అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సిద్ధ అనే ఓ పాత్రలో అలరించనున్నాడు.
ఇక కొరటాల శివ షేర్ చేసిన ఫొటోలో చరణ్ వెనుక నుంచి కనిపిస్తున్నాడు. పవర్ ఫుల్ లుక్‌లో చరణ్ కనిపిస్తుండగా, చిరంజీవి చరణ్ భుజంపై చేయి వేసుకుని ఉన్నాడు. ఈ ఫొటోపై స్పందించిన రామ్‌చరణ్ ‘కామ్రేడ్ మూమెంట్..’ఆచార్య’ సెట్లో ప్రతి క్షణాన్ని చిరంజీవిగారితో, కొరటాలగారితో ఎంజాయ్ చేస్తున్నాను’ అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఏడాది మే 13న ఈ సినిమా ప్రపంచావ్యాప్తంగా విడుదల కానుంది.