వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ లో ఉన్న ఆయన త్వరలో మరో పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభాస్ ఎక్కువ శాతం ముంబైలోనే ఉండనున్నాడు. ఈ క్రమంలో తన మకాం పూర్తిగా ముంబైలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే అక్కడ భారీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడు. ముంబైలోని ఖరీదైన ఏరియాలో రూ.50 కోట్లతో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రభాస్. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు ఆయన బృందం ఇల్లు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు.