ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా ‘క్వాంటికో’ సిరీస్‌తో హాలీవుడ్లో సైతం మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్‌లోనూ కథానాయికగా రాణిస్తున్నారు. హాలీవుడ్లో నటిగా రాణిస్తున్న తరుణంలోనే తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌జొనాస్‌తో ప్రియాంకకు పరిచయం ఏర్పడడం.. ప్రేమ.. అనంతరం పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2018లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
కాగా.. ఈ స్టార్ కపుల్ వివాహానికి ముందు ఓ ఒప్పందం పెట్టుకున్నారంట. ప్రతి మూడు వారాలకోసారి కలుసుకోవాలని పెళ్లి సమయంలో ఒప్పందం చేసుకున్నట్లు ప్రియాంక తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు ప్రియాంక మాట్లాడుతూ.. “మేము ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలని నిబంధన పెట్టుకున్నాం. మేమిద్దరం వృత్తి రీత్యా ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది. అందుకే పెళ్లి సమయంలో ఈ నియమం పెట్టుకున్నాం. లేదంటే ఒకరికొకరం సమయం కేటాయించుకోవాలనే ధ్యాసే ఉండకపోవచ్చు కదా” అంటూ ప్రియాంక చెప్పుకొచ్చారు.
కాగా, 2018లో డిసెంబర్ 2వ తేదీన ప్రియాంక,నిక్‌జొనాస్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. భారత్ లో ఉన్న జోధ్‌పూర్‌లోని ఉమైడ్ భవన్ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల మధ్య వీరి వివాహం రెండు రోజులపాటు రెండు సంప్రదాయల్లో జరిగింది.