అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ టీమ్ నుంచి మరో స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్’గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా, దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి ‘పుష్ప’ సినిమా కోసం పని చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ చిత్రానికి అకాడెమీ అవార్డ్ అందుకున్న ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ‘పుష్ప’ సినిమాని సౌండ్ డిజైనింగ్ చేయనున్నారు. అలానే రజినీకాంత్,విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు పని చేసిన ప్రముఖ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ‘పుష్ప’ మూవీకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో బన్నీ విభిన్నంగా కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.