కేంద్ర బడ్జెట్ 2021ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్ కాగితరహితంగా ఉంటోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్ పత్రాలకు బదులు ట్యాబ్‌తో పార్లమెంట్లో అడుగుపెట్టారు.కాగా,ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.
కరోనా కారణంగా వివిధ సహాయాలు ప్రకటిస్తూ మినీ బడ్జెట్ల పరంపర కొనసాగిందని, దానికి కొనసాగింపుగా బడ్జెట్ ఉంటుందని ప్రధాని పార్లమెంటు సమావేశాల తొలిరోజు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో అందరికీ ఊరటనిచ్చే అంశాలు ఉండనున్నాయి. కాగా,కరోనా టీకా రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ జరగుతోంది. భారత్ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సమర్ధవంతమైన పథకాలను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు..సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు.