పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, యంగ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగమయ్యారు. ఈ చిత్రానికి ఆయన మాటల రచయితగా పనిచేయనున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందించనున్నారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ఓ పాటపాడనున్నారని తమన్ తాజాగా తెలిపారు. ‘వకీల్‌సాబ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడబోయే పాట అదిరిపోతుంది అని చెప్పాడు ఈయన. కాగా, ఇప్పటికే కెరీర్లో దాదాపు ఎనిమిది పాటలు పాడాడు పవన్ కళ్యాణ్. ‘తమ్ముడు’లో ‘ఏమ్ పిల్ల మాటాడవా’, ‘తాటిచెట్టు ఎక్కలేవు’ సాంగ్స్ తో అలరించిన పవర్ స్టార్ ‘ఖుషి’లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ’ పాటతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత ‘జాని’లో ‘నువ్వు సారా తాగుటమానురన్నో’, ‘రావోయి మా ఇంటికి’, ‘పంజా’లో ‘పాపారాయుడు’, ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా’, ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కొటేశ్వరరావు’ పాటలతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్.