పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఈవెంట్ కి అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు. యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘వకీల్ సాబ్’ ఈవెంట్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కేవలం సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు మాత్రమే హాజరయ్యేలా హైటెక్స్ లో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఈ సినిమా ఈవెంట్ ని టెలివిజన్ న్యూస్ ఛానల్స్ ద్వారా అభిమానులు వీక్షించే అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను మరింత భారీగా చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.