ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలం తేదీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న ఈ మినీ వేలం జరగనుంది. కాగా,ఐపీఎల్14 సీజన్ మినీ వేలం కోసం ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. మొత్తం 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందికి మాత్రమే అనుమతి లభించింది..ఈ వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ కుమారుడు అర్జున్‌కు సైతం వేలంలో చోటు కల్పించారు.
ఇక భారత్ నుంచి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్,వెటరన్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ మాత్రమే రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే మరో 8 మంది విదేశీ క్రికెటర్లు సైతం రూ.2కోట్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇందులో గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రూ.1.5 బేస్‌ప్రైజ్ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్యాదవ్తో పాటు మరో 11 మంది క్రికెటర్లను చేర్చారు…ఇక ఈ మెగా టోర్నీలోని 8 జట్లలో కలిసి మొత్తంగా 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.