ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. కాగా ఏపీలో స్థానిక సంస్థలను నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. కాగా,ఆంద్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుందని ప్రకటించింది.